శుభకార్యాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌గా మొక్కలు ఇద్దాం: మంత్రి హరీశ్‌

 రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌గా మొక్కలు ఇద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట సుడా కార్యాలయం ముందు సుడా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా  నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్‌రావు విచ్చేశారు. ఈ సందర్భంగా శార్వరీ గ్రీన్‌ పార్కును మంత్రి ప్రారంభించారు. అనంతరం సుడా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లక్షా 10 వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 200 మొక్కలు, ప్రతి మున్సిపాలిటీలో 5 వేల మొక్కలు, సిద్దిపేట సుడా పరిధిలో 5,900 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ ఆకుపచ్చ తెలంగాణగా మార్చుతున్నారన్నారు. ప్రతి ఒక్కరం ఒక్కో మొక్క నాటి కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదామని పిలుపునిచ్చారు.